Wednesday, January 22, 2014

ప్రస్తుతం పెళ్లి అయిన తరువాత చాలా జంటలు విడాకుల కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు గొడవలు పడుతున్నారు. ఎందుకు వస్తున్నాయి ఈ అకారణ వివాదాలు?

ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు కొందరు.

ఇంతకుముందు రోజుల్లో పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ఎప్పుడు కలుసుకుందామా అని ఎదురుచూస్తూ పెళ్లిగడియ వరకు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూసే వారు. కనీసం మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అంతలా కట్టుబాట్లలో పెంచేవారు. కానీ నేడు ఆపరిస్థితులు లేవు.
జీవితం వేగం పెరిగిందంటూ సెల్ ఫోన్స్(దూరవాణి), ఇంటర్నెట్ (అంతర్జాలం) వచ్చాయి. పెళ్లి కుదరడమే ఆలస్యం గంటల గంటలు, రేయింబవళ్ళు ఒకటే సొల్లు. పెళ్ళికి ముందే కార్యం కూడా కానిచ్చేస్తున్నారు. పోని పెళ్లి అయిన తరువాత కూడా కుదురుగా ఉంటారా అంటే అదీలేదు. ఇంటిదగ్గర బయలుదేరింది మొదలు మళ్లి ఇంటికి వచ్చేవరకు ''టిఫిన్ తిన్నావా, టీ తాగావా? అన్నం తిన్నావా, జ్యూస్ తాగావా? బుజ్జి, బంగారం,'' అని ఒకటే మాటలు. మాట్లాడినవారు మాట్లాడినట్టే ప్రతి అరగంటకి ఎవరు ఏమి చేస్తున్నారో తెలుసుకోకపోతే నిద్రపట్టదు.

ఇంత మాట్లాడుకుని ఇంటికి వచ్చి ఏమి మాట్లాడుకుంటారు. మొత్తం ఆరోజు విశేషాలన్ని అప్పటికే వినేశారు. ఇలా కొన్నాళ్ళకి విసుగోచ్చేస్తుంది. ఎప్పుడూ అవే మాటలు కదా! విని విని చిరాకోచ్చేస్తుంది. ఇక తరువాతి గట్టం గొడవలు. పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. నామీద ప్రేమలేదు అని వాదనలు. అవి చిలికి చిలికి గాలివాన ప్రారంభమై ఆగోడవల్లో కొట్టుకెళ్ళి కొందరు కోర్టు దగ్గర తేలుతున్నాయి. ఇంకొందరు అక్రమ సంభంధాలకి పాల్పడుతున్నారు. ఇదంతా జరిగేది కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో.
ఈమధ్య చాలామందిని రీసర్చ్ చేస్తే లభించిన విశేషాలు ఇవి. ముఖ్యంగా కాపురాలు కూలడానికి కొత్త టెక్నాలజీ ప్రభావం బాగా ఉంది. కనుక ఆత్రుత పడి అతితెలివికి పోకుండా, వీలైనంత తక్కువ మాట్లాడి ఎక్కువకాలం కలిసి ఉండండి. ఎక్కువ మాట్లాడటం, అతిగా ప్రేమించడం వలన కలిగే అనర్ధాల వలన మీపిల్లల జీవితాలని అంధకారంలో పడేయకండి. జీవితాలు నరకప్రాయం చేసుకోకండి. గొడవలు లేకుండా అందరు హాయిగా కలిసి ఉండాలనేదే ఈ సందేశం ఉద్దేశ్యం.

Tuesday, January 14, 2014

తిరుప్పావై పాశురము 30 - మంచి మార్గంలో అడుగు పెట్టడం - సంక్రాంతి


తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిన దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పోందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షినాయీనం పూర్తయ్యి ఉత్తయాయీణం వస్తుంది. దక్షినాయీణం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు  ఉత్తయాయీణం ప్రవృత్తి ఇక దక్షినాయీణం నివృత్తి.  దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షినాయీనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది.  మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకర రాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.

ఇవన్నీ భావించి మన పూర్వులు మనకోక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ప్రతి వ్యక్తి ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనంకూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండగకీ పై పై కి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేషం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.

1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహా యజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పని సరి పంచమహా యజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చెతనైనంతవరకు చేస్తారు.  బసవన్నలకు సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పోందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.

 "వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు  "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.

దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు  దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శణం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది.

"శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే  "తింగళ్ తిరుముగత్తు"  ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పోందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని  నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు  ఆనందాన్ని అనుభవిస్తారు.

Monday, January 13, 2014

తిరుప్పావై పాశురము 29 - భగవత్ సేవయే ఫలం - గోదా కళ్యాణం


ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. "శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృషేకదా. "ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. "ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని  చుట్టూ వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. "నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు ఆయన నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఎం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. "పొరుళ్ కేళాయ్" మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు.  "పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు" మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీసేవయే,  అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, "నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు" నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఎదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. "ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఎం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

"ఎత్తెక్కుం" ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, "ఏరేర్ పిఱవిక్కుం " ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు

Sunday, January 12, 2014

తిరుప్పావై పాశురము 28 - శ్రీకృష్ణుడే సిద్దోపాయం


ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం "గోవిందా" అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది. వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు. పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాల్లుళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం "హే గోవిందా" నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.

అవి ఏమిటంటే

1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.

2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.

3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.

4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.

5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.

6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!

ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నివ్వు అని చెప్పాలి, నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి. అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నివ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు, వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని "వైద్యో వైద్యః" చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.

అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.

మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి.  మరి మేమో "కఱవైగళ్ పిన్ శెన్ఱు " పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోశిస్తాం. లేకుంటే లేదు.

ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. "కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్" అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేం "అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు" ఎలాంటి  జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా.  మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు.
మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే "ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్" మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నివ్వు.

 "కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా" కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా. "ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు" నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు.  సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. "అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్" ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా.  "ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం" చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. "శీఱి యరుళాదే" కోపించక అనుగ్రహించు. "ఇఱైవా! నీ తారాయ్ పఱై" మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూశిస్తారు. అనుగ్రహించు.

Saturday, January 11, 2014

తిరుప్పావై పాశురము 27 - పంచసంస్కారం ఆపై మోక్ష అనుభవం


లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం క్రింద మార్చుకోవటానికి వాడుకుంటారు, దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంటారు, మరి కోందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు. ఏఒక్కరో నూటికి “కశ్చత్ మామ్వేహి తత్వతః” రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా, ఆతత్వాన్ని వినియోగించుకొని ఆతత్వాన్ని సాక్షాత్కరించుకొని మన ఉజ్జీవనకోసం వచ్చిన రూపం ఇదీ అని విశ్వసించడం సామాన్యమైన విషయం కాదు. మనస్సు ఎంతో పరిపక్వం అయితే తప్ప లభించే స్థితి కాదు కూడా. ఆ స్థితి మనకు లభించాలి అంటే మనకు కూడా కొంత తెలుసును అనే అహంభావం తొలగాలి. నేనేదో నా ప్రయోజనం పొందాలి అనే స్థితి తొలగాలి గొల్ల పిల్లల మాదిరిగా. కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదు. వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు. కనుక సాధనము, సాద్యము, జ్ఞానము, జ్ఞేయము, నడిపేది సర్వం శ్రీకృష్ణుడే అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు. అందుకే వారికి పరమాత్మ సర్వాత్మనా లొంగే ప్రవర్తించాడు, వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడు. ఇది లోకంలో ఉండే జీవుల్లలో ఎవరు తననే సర్వమూ అని భావించి, తన ఆజ్ఞని శిరోధార్యంగ స్వీకరించి ఎవరు తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలను అని నిరూపించటమే ఆండాళ్ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం. తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది, ఫలితాన్ని తను పొందింది. భగవంతుణ్ణి మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనే, మరొక చోటికి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం. విభవానికి మనం పోలేం, లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం, పరమపదం మనకు ఊహకికూడా అందనటువంటిది, కనిపించేరూపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే. విగ్రహంలో భగవంతుడు కాదు మన సాంప్రదాయం, విగ్రహమే భగవంతుడు అని మన ఆగమాలు నిరూపించే సిద్దాంతం. దాన్ని నమ్మిన ఆండాళ్ దాన్నే మనకు ఆదేశించింది, దాన్నే ఉపదేశించింది. శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడు, నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించటానికి ఈనాడు మన వద్ద అర్చామూర్తియై ఉన్నాడు. కావల్సింది మనలో ఉండే విశ్వాసం.

శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎట్లా ఉండాలో చూపించాలని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరగించుట అనే అద్భుతమైన లీలను తన చుట్టు ఉండే గొల్ల పిల్లలకి చూపి వాళ్ళని ఆనందంతోటి ఉన్మస్తక  స్థితిలోకి తీసుకు పోయాడు. అయితే దాన్ని విశ్వసించటం  చతుర్వేద అధ్యేతను నేను అనుకున్న చతుర్ముఖ  బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు. చివరికి వారికి పాటం నేర్పి జ్ఞానోదయం కలిగించాల్సి వచ్చేంత వరకు. శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలనందరికి చెప్పాడు, రేపటి నాడు మనం అంతా వనభోజనాలతో విందు చేసుకుందాం, ఎవరెవరి ఇళ్ళలోంచి వారికి వారికి తోచినవి ఏవేవో తెచ్చుకోండి అని చెప్పాడు. అందరూ తెచ్చుకున్నారు, తాను తెచ్చుకున్నాడు. ఆందరిని చుట్టూ కూర్చోబెట్టాడు, ఒక్కొక్కరివస్తువులని రుచిచూడటం ప్రారంభించాడు, అందంగా వారు తయారుచేసిన వైనాన్ని పొగడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరగింపు చేస్తూ అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి  అందిస్తూ, తాను ఆనందం పోందుతున్నాడు శ్రీకృష్ణుడు. అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గరి నుండి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవడంతో, కృష్ణుడికి ఎలా ఇవ్వడం, కృష్ణుడు తన దగ్గరికి వచ్చేలోపు తాగేయ్యాలని గబ గబా త్రాగటం మొదలు పెట్టాడట. అయితే కృష్ణుడు తన పై ప్రేమ తో తెచ్చిన ఆ గొల్లపిల్లవాడి సంబంధం కల్గిన పదార్థం తనకు దొరక కుండా పోతుందేమో నని దిగులు చెంది, గబ గబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడు. దీన్ని చూసి చతుర్ముఖ  బ్రహ్మకి  ఏం అర్థం కాలేదు. వేదాధ్యయణం చేసినవాడాయే నిప్పునుని కూడా కడిగి తీసుకొనే ఆచారవంతుడు, తనకు ఈ విషయం నచ్చలేదు. జగత్ కారణ తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేది అని అనుకున్నాడట బ్రహ్మ. అయితే, ఈ పిల్లవాడు ఏదో ఇంధ్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలెనని బ్రహ్మగారు అనుకున్నారు, గోవులను గోపబాలురను దాచాడం, తరువాత బ్రహ్మ లోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చెయ్యటం, ఆపై బ్రహ్మకు బుధ్ధి  రావడం జరిగాయి. ఆనాడు ఆ పిల్లలకందరికి సద్దులు ఆరగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడు, మోక్షానందం ఏమిటో చూపించాడు.

అయితే మోక్షం అనగా ఏమి ?

మోక్షం అనగా ఆనందించుట, దీనిపై రక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఉపనిషత్తులు మోక్షంలో జీవుడు ఎలా ఉంటాడో అని ప్రశ్న వేస్తూ, “బ్రహ్మవిత్ ఆప్నోతి పరం” అని చెప్పాయి. ఆంటే ఆనందం అనేది తెలుసుకున్నవాడు ఒక గొప్ప స్థితిని లేక పరంను పోందును.

అయితే ఆ పరం ఎలా ఉండును ? అని త్తైత్రీయ ఉపనిషత్తు వర్ణించింది ఇలా “ఆప్నోతి ” అంటే పోందటం, లేక తినటం లేక  అస్నుత అని చెప్పింది. “సోహాస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణాభి పశ్చితేభిః" . సహ- ఈ ముక్త జీవుడు అస్నుతే- ఆరగించును. దేనిని ? సర్వాన్ కామాన్ - దేన్నైతే జీవుడు కోరుకుంటాడో దాన్ని. మరి జీవుడు ఏమి కోరుకుంటాడు ? భగవంతునిలోని కళ్యాణ గుణాలను కోరును.  దీన్నే వేదం ఇలా చెప్పింది. "తస్మిన్ యదంతః తదుపాసితవ్యం" అంటే తస్మిన్- ఆ పరమాత్మ యందు, అంతః-యత్ - లోపల ఏదైతే కళ్యాణ గుణ సంపద ఉన్నదో, తదుపాసితవ్యం- ఆ ధనాన్ని కోరదగును అని చెప్పింది. సర్వాన్ కామాన్- అన్ని కళ్యాణ గుణములను మరి ఎట్లా అనుభవించును ? బ్రహ్మణాభి- పరమాత్మతో,  సహ-కలిసి  పశ్చితేభిః- అనుభవించును. అయితే సంస్కృత వ్యాకరణంలో "తో కలసి" అని చెప్పేప్పుడు భోగ్య సహచర్యం మరియూ భోతృ సహచర్యం అని రెండు ఉంటాయి. రాజుగారితో మంత్రి కలిసి   వచ్చెను అన్నప్పుడు రాజుగారికే ప్రాధాన్యత ఉంటుంది. భోతృ సహచర్యం అంటారు. అయితే భగవంతుడు తన కళ్యాణ గుణాలతో కలిసి  ఎప్పటికీ ఉంటాడు, గుణాలను విడదీసి అనుభవించటం అనేది జరగదు. ఇక జీవుడు భగవంతుడిలో ఏకం అవడం అనేది జరగదు. ఉపనిషత్తులు చెబుతూ "తమః పరేదేవే ఏకీ భవతి" ఏకీ భావమే పర్యవసానం తప్ప, "ఏకం భవతి" అని చెప్పట్లేదు, ఇది గుర్తుంచుకోవాలి.  "ఏకీ భవతి" అంటే ఒకటివలె అగును అని వ్యాకరణం చెబుతుంది. మరి జీవుడు పరమాత్మలో ఐక్యం కాడు, జీవుడు పరమాత్మను. చేరును. చేరి ఏమగును ? ఎక్కడో మూలన పడి ఉండునా, అలా పడి ఉంటే దాన్ని కైవల్యం అంటారు. మరి ఏమగును ? అంటే జీవుడు పరమాత్మను ఆయన గుణములతో అనుభవించును. మరి గుణములతో అనుభవించటం అంటే ఏంటి? ఇది అర్థం అవడం కష్టం. గుణములను చూడలేం, లెక్క పెట్టలేం. బ్రహ్మం అంటే తెలియదు, గుణం అంటే తెలియదు, ఇక అనుభవించటం అంతకన్నా తెలియదు. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.  అందుకే వేదవ్యాస భగవానుడు "శ్రీకృష్ణభగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్నే మోక్ష అనుభవం అని చెప్పాడు" ఒకడు అనేకమందితో కలసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తాను పొందుతూ అన్నం తినెను. ఇదే కదా కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లీలలో ఉన్నది.

వేదం మోక్షాన్ని అన్నం తినడం అనే దానితో పోల్చి చెబుతుంది. మోక్షంకి వెళ్ళాక "అహం అన్నం అహం అన్నం అహమన్నాదో అహమన్నాదో" అంటూ సాగుతుంది. అయితే ఉపనిషత్తులు అన్నం అంటే "అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం తదుచ్యతే ఇతి" అద్యతే- క్రమంలో తింటే తృప్తినిస్తుంది, అత్తిచ భూతాని- క్రమం తప్పి తింటే అది మనల్ని తినేస్తుంది, అంటే శరీరం పాడై పోతుంది అని అర్థం. అందుకే క్రమంలో తినే దాన్నే అన్నం అంటాం. అయితే జీవుడు మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే భగవంతుడు లేదు అహం అన్నం- నేను నీవు అనుభవించటానికి అని అంటాడట. అయితే జీవుడు అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట, ఆపై భగవంతుడుకూడా అహమన్నాదో- నేను ఆ అన్నాన్ని అనుభవించే వాడిని అని అంటాడట. అయితే అనుభవం పోందేదెవడు, అనుభవించేదెవడు ఇటా అటా, ఆ ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఏవరు అనేది గుర్తించ వీలు కానట్లు సామానత్వం ఏర్పడుతుంది.


అయితే జీవుడు పరమాత్మను చేరాక సర్వాత్మనా సముడగును ఆయన వంటి రూపం,గుణం,ఆనందం, అనుభవం పొందును. బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసభగవానుడు రెండు విషయాలు తప్ప సముడగును అని చెప్పాడు. అది శ్రీయ పతిత్వం, జగత్ కారణత్వం. ఇది వీడు కోరడు, వాడు ఇవ్వడు. శ్రీ మనకు అమ్మ ఇక జగత్ సృష్టీ  స్థితీ  లయాలు పెద్ద భాద్యత వాడే ఉంచుకుంటాడు. బ్రహ్మ సూత్రాల్లో "భోగ్య మాత్ర సామ్య లింగాః" అయితే అనుభవం మాత్రం సమానం, జీవుడికీ భగవంతుడికీ తేడా ఉండదు. ఇక ఈ అనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు, అందరికీ సమానం. ఆ అనందం పరమాత్మ ఆనందంతో సమానం అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. వేదం అదే చెప్పింది. శ్రీకృష్ణుడు ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడు, వాళ్ళకీ చూపించాడు.  గోదా దేవి సద్దులు ఆరగించడం ఏం ప్రారభ్దం కనుక ఎంచక్కా మనం పరమాన్నాన్నే ఆరగిద్దాం అని చెప్పింది.

అందుకే గోదాదేవి "పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్" కలిసి అందరం పరమాన్నాన్ని తినవలెనని చెబుతుంది. మరి ఎలాంటి పరమాన్నం అంటే జీవుడుంటాడు దేవుడుంటాడు, ఇరువురిలో సమానత్వం ఉంటుంది. ఇరువురిలోనూ ప్రీతి ఉంటుంది, ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తెలియనంతగా, మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడింది? అంటే వాడి కళ్యాణ గుణాలవల్ల ఏర్పడింది. ప్రీతి పైన నిండి ఉంది, వారిరువురి మద్య కలిసి వీడనంత స్నేహం, అది ప్రీతిలో అంతటా కల్సి ఉంది. జీవుడూ పరమాత్మ కల్సి ఉన్నారు సుమా అని గుర్తించాలే తప్ప విడదీసి చూడలేం. ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్నే మనం పరమాన్నం లేక పాయసంలో చూడొచ్చు.ఆండాళ్ ఇదే పాయసాన్ని కోరుతుంది. "పాల్ శోఱు" పాలు కల్సిన అన్నం "మూడనెయ్ పెయ్దు" అందులో నెయ్యి పూర్తిగా తేలుతూ ఉండాలి, దాంట్లో తీపి పాలల్లో, నెయ్యిలో, భియ్యపు కణాల్లో కల్సి ఉండాలి. వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే.


ఏమిటీ పరమాన్నం ? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. దాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. దాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోదాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి.

"శ్రీషం ప్రపద్య ఆత్మవాన్ ప్రారభ్దం పరి బుజ్య
కర్మ శకలం ప్రక్షీణ కర్మాంతరః జ్ఞాసా దేవ
నిరంకుశేష్వర దయా నిర్లూణవ మాయాన్వయః హార్థా
అనుగ్రహ లబ్దం మధ్య దమని ద్వా రాత్ బహిర్ నిర్గతః ముక్తః
"

ఉపనిషత్తులు జీవుడు ఎలా సాగునోనని చెబుతూ, మనకు లభించిన కర్మ అనుభవంచేత తనయందు ఫల కర్తుత్వాన్ని త్యాగం చేస్తూ వాటి యందు పట్టు లేకుండా సాగించే జీవన యాత్రలో కర్మలు అన్నీ తొలగినట్లయితే ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి బ్రహ్మరద్రం గుండా బయటికి ముక్తుడగును.

ఇలా పన్నెండు మార్గాలు అర్చి దిన పూర్వపక్ష శడు దర్మాస అబ్దవాత్ అంశుమత్ తో విద్యుత్ ఇంద్ర ధాత్రు ఇలా పన్నెండు లోకాలను దాటుతూ విరజాస్నాతుడవుతాడు. విరజలో జీవుడిని కడుగుతాడు. జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి, దాన్యం పై ఉండే పొరను తీసినట్లుగానే. రజస్ సంపర్కం పూర్తిగా తొలగేట్టు చేస్తాడు పరమాత్మ. అప్పుడు జీవుడు పరమపదం చేరగల్గుతాడు. పరమాత్మ రూపు పొందగల్గుతాడు. సారూప్యం ఏర్పడుతుంది. అక్కడున్న ముక్త జీవులు వీణ్ణి పరమాత్మ వద్దకు తీసుకు పోతారు. సాన్నిప్యం ఏర్పడుతుంది. అక్కడ పరమాత్మ-అమ్మ ఒడిలో వివిద రకాల సేవలు అందిస్తూ, అనందం పొందుతాడు. సాలోక్యం ఏర్పడుతుంది. ఇలా చివరి  స్థితి సాయిజ్యం ఏర్పడుతుంది.  యుక్ అంటే కల్సి ఉండేది. జీవుడికి జ్ఞానం, పరమాత్మకు కళ్యాణ గుణలు, వీటిలో ఇరువురూ కల్సి ఉండడమే సాయుజ్యం, దీన్నే మోక్షం అంటారు.

మొదట బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, మనం ఉపనిషత్తులని పశువులని అనుకోవచ్చు. ఈ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలని రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, తియ్యదనం వలె. ఇందులో జీవుడూ భగవంతుడూ కల్సి ఉన్నారా లేదా అన్నట్లుగా కల్సి ఉంటారు.  పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆండాళ్ దీన్నే కోరుతుంది.
పరమాత్మ కున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవింద నామం. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం “గోవింద” నామం. అందుకే మన వాళ్ళు ఏదైన పని చేసే ముందు శ్రీ గోవింద గోవింద గోవింద అంటూ సంకల్పం చేసుకొని కార్యంలోకి ఉజ్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. ఏడు రోజులు గోవర్దన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపీ జన సంరక్షణ చేసి, ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నాడు. కష్టపడి సంపాదించిన నామం అవడంచే ఆ నామంతో పిలవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకె ఈరోజు నుండి వరుసగా మూడు రోజులు గోవిందనామం ఉచ్చరించి అనుగ్రహం పోందుతారు.

"గోవిందా" గోగోపగోపీజన సంరక్షకా "శీర్" నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే, "కూడారై" కూడని వారిని, నీ దరికి రాని వారిని "వెల్లుమ్" జయించి నీ దరికి రప్పించుకుంటావు. కూడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టక ఉదాసీనులు కొందరు, ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మచ్చ అంటుతుందోఅని కొందరు. కూడని వారిని తన భాణాలతో దరికి లాక్కుంటాడు.ఇక ప్రేమించి దూరం అయ్యేవాళ్ళను తన అనునయంతో దరికి చేర్చుకుంటాడు. నమ్మాళ్వార్ అలానే, స్వామీ నే దరికి రానే రాను, నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే స్వేత వస్త్రంకు మచ్చ అంటూ దూరం పోతుంటే, స్వామి నమ్మాళ్వార్ ని నిలిపి "వళవేళ్ ఒలగిన్" అనే తిరువాయిముళి అనే దివ్యప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్వార్ అనగనగా ఒక గోకులం, నేనే శ్రమించి గోవులని కాచా, పాలు పెరుగు వెన్న భాగావచ్చాయి, కానీ నాకందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా. తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్వార్ వారిదేనయ్యా అని చెప్పాడు. మరి నేను కష్టపడి సంపాదించింది దాచటం తప్పా కాదా అంటే, తప్పేనయ్యా అని నమ్మాళ్వార్ చెప్పారు. నీవు ఒక కుండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించిది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిది అంటే పాపం నమ్మాళ్వార్ స్వామికి లోంగిపోవాల్సొచ్చింది. గొప్పవాడై ఏ యోగ్యతలేని వారి వద్ద అరమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీనులని తన అందం, ప్రసాదం చూపి దరికి చేర్చుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీది ఉత్సవాలు ఉదాసీనులని కటాక్షించటానికే.

ఇంత వరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఇన్నాళ్ళకు నీ సన్నిధి చేరామయ్యా! నీమాట పలకటానికి ఇష్టపడని ఈ లోకం, "ఉన్ఱనై ప్పాడి" నీ నామాన్నే పాడేట్టుగా మమ్మల్ని మార్చు కున్నావు. "పఱైకొండు"  నీ పాట పాడి నీవిస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి "యామ్ పెరుసమ్మానమ్"  మేం గొప్ప సత్కారం పోందాలని అనుకుంటున్నాం. మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం, సత్కారం లభించటానికి కాదు, ఇవన్నీ నీవు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికే ఆనందం కానీ చేతుకు కాదు కదా! "నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక" లోకం అంతా కీర్థించేలా సత్కారం కావాలి.  విభీషనుడికి , సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం వల్ల లోకం రాముణ్ణే కదా కీర్థించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు.  వాటిని సూచిస్తోందా అన్నట్టుగా గోదా పంచ సంస్కార పక్రియను చెబుతుంది. "శూడగమే" చేతికి ఒక కంకణం కావాలి, "తోళ్ వళైయే" భుజానికి ధరించే ఆభరణం, "తోడే", చెవికి ధరించే ఒక ఆభరణం, "శెవి పువ్వే" చెవి పైకి పరిమలం కోసం ధరించే మరొక ఆభరణం, "పాడగమే" పాదాలకు ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతుంది గోదా.  ఆచార్య ఆశ్రయణం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖ చక్రాలు, చెవికి అష్టాక్షరీ మహా మంత్రం, పరిమలాన్నిచ్చే ద్వయ మంత్రం, పాదాలా అన్నట్టుగ చరమ శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు. "యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్" మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు. "ఆడైయడుప్పోం" నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుణ్ణి చేరాటానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచబౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. "అతన్ పిన్నే" అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావల్సింది "పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార" పరమాన్నం, అదే పరమ పదం. "కూడి ఇరుందు " అందరు కల్సి గోష్టిగా తినడానికి, "కుళిరుంద్" ఈ కలయిక తో మన ఈ సంసార తాపం అంతా తొలగాలి.

Friday, January 10, 2014

తిరుప్పావై పాశురము 26 - శ్రీ కృష్ణుడి సామర్థ్యం


ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా "శెయ్యాదన శెయ్యోం" మన పూర్వులు చేయనివి చెయ్య కూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతి కేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి.  ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై "మేలైయార్ శేయ్-వనగళ్"  ఏవి మన పూర్వులు ఆచరించారో మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా  "నానే తాన్ ఆయిడుగ" నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి "మేలైయార్ శేయ్-వనగళ్" సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.

స్వామిలోని ప్రేమను కనిపెట్టి “మాలే మణివణ్ణా” ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిప్పెట్టేసారు, ఇక ఎక్కడ లోంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ  కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. “మార్-గరి నీరాడువాన్” మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు.  అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. “మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన” మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు.  అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. “కేట్టియేల్” వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు.   అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. “ఞాలత్తై యెల్లాం” భూమినంతా  “నడుంగ” వణికించేట్టుగా “మురల్వన” ద్వని చేసేట్టి “పాలన్న వణ్ణత్తు” పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, “ఉన్-పాంచజన్నియమే పోల్వన”  నీ పాంచజన్యాన్ని పోలిన  “శంగంగళ్” శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన  అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాదారణ ఆయుదాలు ఉంటాయికదా.

ఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శణ చక్రం కావాలయ్యా అనిడిగాడట. ఇది ఇతరులకు లోంగి ఉండదు అని చెప్పి చూసాడు,  ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు. అయితే పరమ శివుడికి  శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని,  ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట.  శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.

ఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందంవేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలి పోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది,   ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏంచెబుతుందంటే  అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె.  ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అను కున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.


మాకు ఇంకా “పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే” శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా “పల్లాండిశైప్పారే” పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా “కోలవిళక్కే” ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా “కొడియే” ద్వజం కావాలి, ఇంకా “వితానమే” మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.

ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, “ఆలిన్-ఇలైయాయ్” అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలం పై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిదిలేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా “యరుళ్” నీ దయ అని స్వామిని కోరారు.


ఇక వీళ్ళకు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేశుడు వెళ్ళడు కనక, తాను దరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళకు అదే చాలు.

Thursday, January 9, 2014

తిరుప్పావై పాశురము 25 - శ్రీ కృష్ణావతార రహస్యం


ఆండాళ్ తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది, అర్చామూర్తినే పొందింది. ఎవరినో చూపించలా, తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది. అందుకే తిరుప్పావై ని మనం విశ్వసించాలి. భగవంతుడు మనకోసం ఇట్లా వస్తాడని మనకు తెలియాలి, ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కల్గించి చేసే ఉపకారం. ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతక గల్గితే మనం ఉన్నచోట భగవంతుణ్ణి సేవించుకోగలం. ఇక మన ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా, ఇక సృర్తినిచ్చేవిగా ఉండగల్గుతాయి. గోదా దేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది.

ఈ రోజు మనవాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తున్నారు. స్వామి వీరిని మీరేదొ కోరి వచ్చారుకదా, అదేదో చెప్పండి అని అడిగాడు. వీళ్ళు మేం ఏదికోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు. అబ్బెబ్బే నాకేం తెలియదు అని స్వామి చెప్పాడు. అబద్దాలు ఆడకు, నీవెవరో, ఎందుకిక్కడికి వచ్చావో, ఎట్లావచ్చావో, ఎక్కడినుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానం అంతా స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు.

అట్లా తెలుసుకొని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి, చివర ఒక మాట చెప్పాడు.

వీత రాగ భయ క్రోదాః మన్మయా మా ఉపాస్రితాః
వహ వహ జ్ఞాన తపసాః పూతాః మద్భావ మాగతాః

రాగం, భయం, క్రోదాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి. భగవంతుణ్ణి గుర్తిస్తే రాగం వాడిపై ఉంటుంది. ఇక భయం, మనకు రాగం కల్గినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం. మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉండేప్పుడు మనం దేన్నుంచి దూరం అవుతాం కనుక. అది ఎప్పుడూ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్నేలేదు కదా. నీవు ఎదోక దానియందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే, దాన్ని దూరం చేసే దానియందు నీ మనస్సులో ఏర్పడే స్పందన క్రోదం అంటాం. ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోదం కలిగే ప్రశ్నేమిటి కనుక. ఇవన్నీ తొలగాలంటే భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా, చేసేటువంటి వాటి యందు పట్టు లేకుండిన, ఇవన్నీ తనప్రయోజనం కోసం కాదని భావించటంచే తనకు అంటుకోవటం లేదు. ఈ జ్ఞానం చేతనే వాళ్ళలో ఉండే రాగ, భయ, క్రోదాలు తొలగి పోతాయి. అందుకే "త్యక్త రాగ భయ క్రోదాలు" అని అనలేదు స్వామి. త్యక్తం అంటే త్యజించడం, వదలటం. వీత అంటే తొలగిపోయిన అని అర్థం. దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటికి వదిలివేయటంలేదు, చీకటి తానంతట తానే తొలగి పోతోంది. మనం రాగ, భయ, క్రోదాలను వదిలివేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం వదలడం కాదు, అవి వదిలి పోవాలి మనల్ని.

ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే, వాడి జ్ఞానం మనకు కల్గి నప్పుడు. ఆండాళ్ ఈ రోజు అదే వివరిస్తుంది. మాకుతొలగాల్సినవి తొలగాయయ్యా. రజస్సు తొలగింది, అహం మమతలు తొలగాయి, మాలో ఉండే కర్మల పట్టు కూడా తొలగింది. ఆడిన ప్రతి మాట ప్రతి చేష్ట నీవరకు పర్యవసిస్తుంది.  మాకు సరియైన జ్ఞానం కల్గింది, నీవేవరో మాకు తెలిసింది. ఇక ఈ జ్ఞానం "మద్భావ మాగతాః" తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావుకదా, మా కిప్పుడు కావలసింది అది అన్నారు. అవన్నీ నాకుతెలియవు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తా అన్నాడు స్వామి. అదేం కుదరదు, నీ సంగతి మాకు తెలుసును, నీ వెవరివో మాకు తెలుసూ అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్ట పరుస్తున్నారు.  నీవెవరో మాకు తెలుసు, ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకువి అని అనుకుంటున్నారు, కాని "ఒరుత్తి మగనాయ్ పిఱందు " ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. అవతరించాడు అని చెప్పడంలేదు ఆండాళ్ ఎందుకంటే అయన మన తోటి సాటివాడు కావాలని వచ్చాడాయన.  అవతరించాడు అని చెబితే అది ఆయనని తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. అందుకే ఆండాళ్ తల్లి నీవు పుట్టావు అని చెబుతుంది.

ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే, స్వామిపై అంత ప్రేమ. మరి పుట్టింది అద్వితియురాలు అంటే, ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం. ఎవ్వరికి తెలియకుండా నందగోకులం చేరి, "ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర" మరొక అద్వితియురాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. ఆమె ఎంత అదృష్టవంతురాలు.


"తరిక్కిలానాకి" సహించలేక పోయాడు ఆ "త్తాన్" ఆ నీచుడు, కంసుడు అని పేరుకూడా చెప్పడం లేదు. కొందరి పేర్లు చెబితేనే నోరు పాడై పోతుంది అని. ఏం చేయ్యాలని అనుకున్నాడంటే  "తీంగు నినైంద" కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో, "కరుత్తై పిరపిత్తు" అది వారికే జరిగేట్టు చేసాడు. "కంజన్ వైత్తిల్ నెరుప్పెన్న నిన్న" కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు. కృష్ణుడు నిప్పు కాదు, కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది. అదే ప్రేమ అయితే తరించి పోయేవాడు.

స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తున్నాడు. ఆయన కళ్లల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ తల్లి. "నెడుమాలే" అయన దీర్గమైన వ్యామోహం, ప్రేమ కల్గినవాడు తనను ఆశ్రయించుకున్నవాళ్ళ యందు, అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది, కృష్ణుడి తమపై ప్రేమలేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా, మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అణుమాత్రం, ఆయన విభువు , అయన కుండేది మనపై ప్రేమ విభువంతా. సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడువిచ్చాడు, రాముడితో చెప్పు "మార్తా దూర్దం న జీవిష్యే" నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది.  హనుమ ఈ విషయం చెప్పగానే, రాముడు ఆశ్చర్యంతో "యది మాసం దరిష్యతి చిరంజీవతి వైదేహి" అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంతకాలమైన ఉండ వచ్చును. మరి తనో, "నజీయేయం క్షణమపి వినాతాం అశితేక్షణాం" నేను క్షణ కాలం కూడా జీవించలేను అన్నాడు, విభువైన వాడు ఆయన కనుక ఆయనకుండే ఆర్తి మనపై కొండంత. వీళ్ళకు ఈరోజు ఆయన కళ్లల్లో అంత వ్యామోహం చూసారు.

సరే ఇంక ఏంకావాలి అని స్వామి అడిగాడు. "ఉన్నై అరుత్తిత్తు వందోం" మేం నిన్ను కోరి వచ్చాం. "పఱై" వ్రత పరికరాలు "తరుతియాగిల్" నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం. స్వామి వీళ్ళను పాపం శ్రమ  పడి వచ్చారర్రా అని అనగానే, "తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్" లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాళ్ గోష్టి వారు.

Wednesday, January 8, 2014

తిరుప్పావై పాశురము 24 - స్వామికి మగళం


నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కంది పోయినట్లు అనిపించింది.  పాదాలు స్వతాహా గులాభి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనం పై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి “సవ్య పాదం ప్రసవ్య” ఎడమకాలు ప్రసరింపచేసాడు, “సృత దురితహరం దక్షినం కుంచయిత్వా” దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని  మంగళం పాడుతున్నారు.

ఈ రోజు పాశురాన్ని మాంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో  తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తనో ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒక నాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు  తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈ నాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం.


గోదాదేవి కి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు. పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు  పలకోటి నూరు- ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నొ సార్లు మంగళం పాడారు. జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు. హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోశం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం.  నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా ,ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక.

ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు. "అన్ఱివ్వులగమ్" ఆనాడు వామనుడై లోకాలను "అళందాయ్" కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే!   "అడి" ఆ పాదాలకు "పోత్తి" మంగళం.

"శెన్ఱ్" వెళ్ళి "అంగు" అక్కడ ఉన్న "త్తెన్-ఇలంగై" దక్షిన దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురున్ని "శెత్తాయ్" సంహరించిన "తిఱల్" నీ భుజ భలానికి "పోత్తి" మంగళం.

"పొన్ఱ" తారుమారు అయ్యేలా "చ్చకడం" శకటాసురున్ని "ఉదైత్తాయ్" తన్ని అంతమొందిచ్చావు, ఏడు నెలల బాలుడవి, "పుగర్" నీ కీర్తికి "పోత్తి" మంగళం.

"కన్ఱు" దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని "కుణిలా" కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపితాసురునిపై "వెఱిందాయ్" గిరగిరా తిరిగి విసిరిపాడేసి "కరిల్" నీ పాదానికి "పోత్తి" మంగళం.

"కున్ఱు" పర్వతాన్ని "కుడైయా" గొడుగులా  "వెడుత్తాయ్" ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ "కుణమ్" సౌశీల్య గుణానికి "పోత్తి" మంగళం.

ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోశం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా "వెన్ఱు" గెలిచి "పకై కెడుక్కుమ్" విరోదభావం లేకుండా చేసే "నిన్ కైయిల్" నీ హస్తంలో ఉన్న "వేల్" శూలాయుదానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుదం "కూర్వేల్"  ఇదేకదా, ఆ శూలానికి "పోత్తి" మంగళం.

"ఎన్ఱెన్ఱ్" ఎల్లప్పుడు "ఉమ్ శేవకమే" నీ చరితమునే "యేత్తి" కీర్తించేలా "ప్పఱై" ఆ వాయిద్యాన్ని "కొళ్వాన్" తీసుకుంటాం. "ఇన్ఱు" ఈ రోజు "యాం" మెం ఎందుకు "వందోం" వచ్చామో "ఇరంగ్" తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.


నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు.  విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.


Tuesday, January 7, 2014

తిరుప్పావై పాశురము 23 - సృష్టి కార్యం నుండి తరువాత వరకు స్వామి దశ


ఈ రోజు ఆండాళ్ ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే
అద్భుత వర్ణన ఈ నాటి పాటలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై లోకి రావాలి, ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి, ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇది మూలం ఇక్కడి నుండే బయటకు వచ్చినవి మాత్రం మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు.

ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాదాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ఇకపై శాస్త్రాలు వర్తించవు ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి  చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరిక్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక ఇక  భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తను వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.

ఈ విషయాన్ని మనం రామాయణంలో గమనించవచ్చు. రాముడు విభీషనుణ్ణి అనుగ్రహించాల్సి వచ్చింది. మొడట తన అభిప్రాయం చెప్పడం లక్ష్మణ, సుగ్రీవాదులను ఒప్పించటం, తరువాత సుగ్రీవుణ్ణి పంపి విభీషనుణ్ణి రప్పించటం ఒక పెద్ద ప్రక్రియ సాగింది. “లొచనాభ్యాం పిభన్నివ” అంటూ ఒక కంటి చూపుతో తను విభీషనునికి రక్షణ ఇవ్వటంలో జరిగిన కాల విలంబనని తెలుపుతూ దగ్గరకు తీసుకున్నాడు. అలాగే మనవాళ్ళంతా స్వామి సన్నిధానానికి చేరగానే స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టాడు. శరణు అంటూ వచ్చిన విభీషనుడికి రాముడే దాసుడై విభీషనుడు చెప్పినట్లూ చేసాడు. విభీషనుడు రాముడిని చేరటానికి శరణాగతే మార్గం అయ్యినందున, అదే మార్గం రాముడికీ చెప్పాడు. సముద్రుడికి శరణాగతి చేయ్యటం ఆ సముద్రుడు అర్హుడా కాడా కూడా చూడలేదు రాముడు. ఇదీ స్వామి తత్వం భక్తుల విషయంలో. తన స్వతంత్రాన్ని పక్కన పెట్టేస్తాడు.

అందుకే మన వాళ్ళు  నిన్న స్వామిని ఎట్లా కళ్ళు తెరియాలో ఆదేశించారు. ఈ రోజు పాటలో గోదాదేవి స్వామిని లేచి, క్రమంగా నడచి వచ్చి సింహాసనం పై కూర్చోని తమ మొరలని ఆలకించమని ప్రార్థిస్తుంది. “క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది, దానిపై కూర్చుని ఉంటే మేం అడిగినవి తప్పక ప్రసాదిస్తావు,  దానిపై నీవు కూర్చొంటే “యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్” మెం ఒక కార్యార్తులమై వచ్చాం, మేం ఎం చేయదల్చుకున్నామో తెలుసుకొని మేం ఎట్లా చెయ్యలో మాకు తెలుపు.

ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎట్లా లేచిరమ్మని చెబుతుంది అనేది ఒక అద్భుతమైన వర్ణన. గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నింటిని తనతో పాటు సమానంగా తీసుకొని వస్తుంది. అందులో ఒకటి పై పై కి కనిపించే కృష్ణ-గోపికల కథ. రెండవది తిరుప్పావై సారాంశమే వేదం కనుక తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెబుతుంది. ఇక మూడవది మనం భగవంతుణ్ణి చూసే స్థానానికి వెళ్ళేప్పుడు మనల్ని మనం ఎట్లా సిద్దం చేసుకొని వెళ్ళవలె అనేది తెలుపుతుంది. భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం విగ్రహా రూపకంలోనే కదా, అది మన ఇంట్లో ఆరాధన చేసుకొనే విగ్రహం ఐనా కావచ్చు లేక ఆలయాల్లో ఉన్న అర్చా మూర్తి ఐనా కావచ్చు. అప్పుడప్పుడు మన ఆలయాల్లో భగవంతుడు బయటికి వస్తూ ఉండే ఆ పద్దతి ఏంటి, ఇక నాలుగవది శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి ఇవన్నీ తెలుపుతు వస్తుంది ఆండాల్ తల్లి.


ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణిస్తుంది. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్దాలు చేసేవారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్నీ లక్ష్మణ స్వామికి విన్నపించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం.  ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని  బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు.  ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే”అవివేకం అనే కారు మబ్బులు జ్ఞానమనే సూర్యున్ని కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షింస్తుంది, సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి వదిలి ఉండని అచ్యుత భానున్ని కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు. అలా  ప్రార్థిస్తూ మరొక వాన కావాలని మన పూర్వులు కోరుతున్నారు, అదేంటంటే

త్వదీక్షణ సుదా సింధు విక్షేప పసీకరైహి|

కారుణ్య మారుతా నీతైహి శీతలైహి అభిషించమాం||


"హే భగవన్! నీ చూపులే సాగరాలు, అందులో కారుణ్యం అనే గాలులు వీస్తుంటాయి, ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో  తేలుతూ ఒడ్డున ఉండే వారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీదయని కురిపించి ముంచెత్తు".   ఈ వానను కోరుకుంటున్నారు.

అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్” పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం” మన్నికగా కాల్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట  తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు.  ఆండాళ్ తల్లి ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాల్ అది “శీరియ శింగం” అని చెబుతుంది.


 “అరివుత్తు” ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు” ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేట్లుగా తెరిచింది.  “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి” ఇటూ అటూ దొర్లుతూ,  “మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు” ఒక పెద్దగా గర్జిస్తూ  “పోదరుమా పోలే” అప్పుడది బయలుడేరినట్లే  నీవూ అట్లా రావాలి.

సృష్టి పూర్వ దశ నుండి సృష్టి  తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహం తో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి” నెనే నానుండి అనేకమందిని తీద్దును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.

మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు,  జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మల్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్దం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం”  ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.

ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచీందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, అయితే శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుందికదా, పరమాత్మ పరిమలం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఈక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలో కి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడు కి బయలుదేరినట్లు గా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కల వాడా,  “ఉన్ కోయిల్ నిన్ఱు” నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవ మూర్తి బయటికి రావాలి, ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి” ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్ప గలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కూడా నేర్పుతుంది.


క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం, జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం ఇన్నింటినీ భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణున్ని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.

Monday, January 6, 2014

తిరుప్పావై పాశురము 22 - అనన్య గతిత్వం


మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుటూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. "ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్" ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.

మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు.

"అంగణ్ మా ఞాలత్తరశర్”  ఈ అందమైన భుమి మీద “అబిమాన పంగమాయ్ వందు” అభిమానాలను వదులుకొని వచ్చి “నిన్ పళ్ళికట్టిల్ కీరే” నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ  ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని  తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.

శంగమ్ ఇరుప్పార్ పోల్” అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని  గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. “వందు తలై ప్పెయ్-దోమ్” ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.

ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, “కింగిణివాయ్ చ్చేయ్ద” చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా  కనిపిస్తాయే, అట్లా కనిపించే  ఆనేత్రాలని  “తామరై ప్పూప్పోలే” పద్మాల్లా “శెంగణ్ శిఱుచ్చిఱిదే” అందముగా, మెల్లి మెల్లిగా  “యెమ్మేల్” మాపై  “విరయావో” ప్రసరించేట్టు చెయ్యి.  “తింగళుమ్” చంద్రుడి చల్లటిచూపులాగా “ఆదిత్తియనుమ్” సూర్యుడి కాంతి వలె  “ఎరుందాఱ్పోల్” ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి “ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం” అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.

తప్పు తప్పు “అంగణ్ ఇరండుం” ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు,  “కొండు ఎంగళ్మేల్” వాటిని మాపై పడేట్లు చెయ్యి. “నోక్కుదియేల్ ఎంగళ్మేల్” ఆచూపులు మాపై పడితే  “శాపం ఇరింద్” మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. “చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన” నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.