Friday, January 3, 2014

తిరుప్పావై పాశురము 19 - సృష్టికి ముందు స్వామి దశ

మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం  అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి.  వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.

"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా!  లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.

నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు  బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాపాడుతున్నారు.

 "కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.

గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచం లో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై  "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల  "నప్పిన్నై" ఆ అందగత్తే "కొంగైమేల్" వక్షస్తలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న  "మలర్ మార్బా!" వక్షస్తలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమే కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. "మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నివ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి  "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని  కొంచం కఠినంగా పిలిచారు.