Pages

Sunday, January 5, 2014

తిరుప్పావై పాశురము 21 - ఆచార్యుడి ద్వారా శరణాగతి

 
భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్" ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ  కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి  చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం  ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి అయ్యాడు ఆయన.  ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.

అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు  బ్రహ్మ. అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చేందాడు.

అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో  అంటాం, కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చా స్వరూపం లో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని  గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ  ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చ కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం" అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా.  విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.

ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం.

నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే "ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు,  ఆ  శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు,  ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి  "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ  భలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో,  మేం అలానే వచ్చాం, దింతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ భలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం,  వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక  నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు.

Saturday, January 4, 2014

తిరుప్పావై పాశురము 20 - ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే


అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, భలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.

ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు,  "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే.  "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


 "శెప్పం ఉడైయాయ్! " సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఎమైంది నీ మాట. " తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఖాఃన్ని  ఇచ్చే నిర్మలుడా, ఏదోశం అంటని వాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.

అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా.  "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరి పూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.


వీళ్ళ  ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి,  " తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి  "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.

పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.

కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ

"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం
 భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి
"


హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే.  తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.

ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది.  పరమాత్మను  చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై  అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు .



Friday, January 3, 2014

తిరుప్పావై పాశురము 19 - సృష్టికి ముందు స్వామి దశ

మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై. శృంగారం  అనేది శరీరాన్ని క్షీణింపచేసేది, కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి.  వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.

"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాది మంగళమ్" అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది, ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా!  లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.

నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు  బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాపాడుతున్నారు.

 "కుత్తు విళక్కెరియ" చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి, అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరువడం లేదు సరికదా స్వామినీ తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు.

గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. "కోట్టుక్కాల్" ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల "కట్టిల్మేల్" కట్టె మంచం లో "మెత్తెన్ఱ" మెత్తటి అతి సుకుమారమైన, "పంచ శయనత్తిన్" పంచశయనంపై  "మేల్ ఏఱి" పడుకొని ఉన్నారు. "కొత్తలర్ పూంగురల్" గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల  "నప్పిన్నై" ఆ అందగత్తే "కొంగైమేల్" వక్షస్తలం "వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న  "మలర్ మార్బా!" వక్షస్తలం వికసించి ఉన్న స్వామీ "వాయ్ తిఱవాయ్" నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమే కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. "మైత్తడం కణ్ణినాయ్!" కాటుకతో విశాలమైన కన్నులు కల "నీ" నివ్వు "ఉన్-మణాళనై" నీ స్వామిని "ఎత్తనై పోదుం తుయిలెర" ఇప్పటికైనా లేపి  "ఒట్టాయ్ కాణ్" మాకు చూపించవా, "ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్" ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, "తత్తువమన్ఱు తగవ్" నీ స్వరూపానికి ఇది తగదు అని  కొంచం కఠినంగా పిలిచారు.

Thursday, January 2, 2014

తిరుప్పావై పాశురము 18 - అమ్మ లక్ష్మీదేవి ద్వారానే స్వామిని సేవించటం


ఈ రోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి, ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం అవసరం లేనిది తొలగించడం. ఇష్ట ప్రాపణం అనిష్ట నివారణం దీన్నే మనం రక్షణం అంటాం. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి, అయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాం. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను. తెలిసో తెలియకనో మనం పాపాలు చేసి ఉండొచ్చు, కాని ఇప్పుడు బాగుపడదాం, అయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు, ఆయనకు మనలోని దోషాలు కనబడొద్దు లేదా దోషాలు త్వరగా తొలగాలి, అలా తొలగింపజేసేది అమ్మ లక్ష్మీ దేవి. ఆయనలోంచి దయ,వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవుడికీ ఆ భగవంతునికి మధ్యవర్తి గా ఉండి వ్యవహరిస్తుంది అందుకే ఆమెను "శ్రీ" అంటారు.

లోకంలో పురుషుడిలో నామ రూపాలు లేని జీవవర్గానికి నామ రూపాలు ఇచ్చేది స్త్రీ, అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనొచ్చు. అదే జగత్ కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్టుగా తీర్చి దిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ, అంటే ఒకనాడు మనం నామ రూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటిపెట్టుకొనే ఉంటుంది, ప్రళయ కాలంలోకూడా. అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి, మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయొచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషకారం అంటారు.


అందుకే మన ఆలయాల్లో అమెకొక సన్నిధి ఉంటుంది, మొదట మనం మన భాదలు ఆవిడతో చెప్పుకోవాలి, అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడా అమె ఆయన వక్షస్తలంపై ఉండి, ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ అయనను విడిచి పెట్టి ఉండదు, ఆయనలోని దయను పైకి ప్రసరించేట్టు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మనకోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఖిఃస్తే, వారు బాగుపడేంతవరకూ తన దుఖంగా భావించటం. వాత్సల్యం అంటే, వత్సం అంటే దూడ, "వాత్సమ్" అంటే దూడపుట్టినప్పుడు అది కల్గి ఉండే మురికి, "" అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే అయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడూ అయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా "అగలగిల్లేన్ ఇరయుమ్" అర క్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకి లాంటి దుష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయట పడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్శ్రేయోదాయకం.


అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది, ఆయన వరాహస్వామి గా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది, ఆయన  రాముడయితే అమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీళా దేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీళాదేవి అనే పేరుతో ఎవ్వరు కనిపించరు. రాధగానో, రుక్మిణి గానో, సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తుత్వాన్ని చేయగలిగినవారు కాదు. మరి ఆయనకుండే పదహారువేల మందిలో ఎవరు నీళాదేవి అని గుర్తుంచేది. అయితే ఆయనకున్న ఎనుమండుగురు పట్టపు రాణుల్లో ఒక ఆవిడపేరు నాజ్ఞజితి. శ్రీకృష్ణుడు నీళాదేవిని ఎట్లావివాహం చేసుకున్నడని మన సంప్రదాయం తెలియ జేస్తుందో అలాగే ఈ  నాజ్ఞజితిని  వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహమాడాటానికి శివధనస్సును చేదించినట్లే, ఈవిడని వివాహం చేసుకోవడానికి ఏడు మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట కృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీళాదేవే పురుషకారం అంటారు.  ఈరోజు నీళాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది.

"ఉందు మదకళిత్తన్"
మదం స్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు "ఓడాద తోళ్ వలియన్" ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజ బలం కలవాడు,   అలాంటి "నంద గోపాలన్" నందగోపాలుని "మరుమగళే!" కోడలా అంటూ పిలిచారు. సీతా దేవి తన గురించి చెప్పేప్పుడు దశరథుడి కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీళాదేవిని నందగోపాలుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు.
ఆవిడ లేవలేదు.  "నప్పిన్నాయ్!" ఓ సమగ్రమైన సౌందర్య రాశి! అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. "కందం కమరుం కురలి" సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కల దానా! మనం చేసిన పాపలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది, ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ."కడై తిఱవాయ్" గడియ తెరువుమా. ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్టు చేసేదని.   

"కోరి అరైత్తన కాణ్" కోడి కూస్తుంది, అయితే కోడి జాము జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీళాదేవి. లేదమ్మా "ఎంగుం " అన్నీ కోళ్ళు కూస్తున్నాయి "వంద్" తిరుగుతూ కూస్తున్నాయి. ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది.  సాధారణంగా జ్ఞానులను కోడితో, పక్షులతో పోలుస్తుంటారు. మనం విన్నా వినకున్నా, జాము జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెప్పుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది.

నీళాదేవి అందంగా పాడగలదట, కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. "మాదవి ప్పందల్ మేల్" మాదవి లత ప్రాకిన పందిరి మీద "పల్గాల్" అనేక సార్లు  "కుయిల్ ఇనంగళ్" కోకిలల గుంపులు "కూవిన కాణ్" కూస్తున్నాయి.


భహుషా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు, "పందార్ విరలి" బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమిలాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాడం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆదీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయ కాలంలో కూడా మనం ఆమె చేతులో ఉంటే రక్షింప బడిన వారమే అవుతాం.

"ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ"  నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేట్టు పాడుతాం. "శెందామరై క్కైయాల్" నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో "శీరార్ వళై ఒలిప్ప" నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా,  "మగిరింద్" అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమ తో, ఆనందంతో  "వందు తిఱవాయ్" నీవు లేచి మాదాక వచ్చి తలుపు తెరవాలి అంటూ నీళాదేవిని అమ్మ లేపింది.

Wednesday, January 1, 2014

తిరుప్పావై పాశురము 17 - ఆచార్యుడు అందించే మంత్రం

ఈరోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మ ను అందించే భాగవతోత్తముల సేవ ఇవన్నిన్నీ పాశురంలో వివరించింది.  నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు. 

ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్, "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.

ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం. "కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి  "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

అక్కడ ఒక పాదంలో  కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మద్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద"లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావా ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా.  అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.

ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి  విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిషువులు పుట్టారు, ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు, ఆ పుట్టిన శిషువుకి ఒక బంగారు కడియం వేసారు, ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు.  "శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన "చ్చెల్వా" ఓ సంపన్నుడా "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నివ్వూ నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే బలరాముడు లేచి  మీరు బ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు నీళాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు.
 

Tuesday, December 31, 2013

తిరుప్పావై పాశురము 16 - భగవంతుణ్ణి పొందేది ఆచార్యుని ద్వారానే


మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పాశురాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన పై పడేట్టు చేసింది మన ఆండాళ్ తల్లి.  ఈ రోజు వారందరిని మనతో కల్పి నందగోప భవనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడినే  మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుణ్ణి తలచి, భగవంతుణ్ణి తనలో కల్గి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు, ఆ భగవంతున్ని దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆచార్యుడి వద్దకు, అందుకే ఆండాళ్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది.

ఆ భవనంకు ఒక తోరణం ఒక ద్వజం కట్టి ఉన్నాయి, ఇదే నందగోప భవనం అని మన వాల్లంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది, వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వార పాలకులు అప్రమత్తం అయ్యారు. ఆండాళ్ ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది.


"నాయగనాయ్ నిన్ఱ" నాయకుడవై ఉండే  "నందగోపనుడైయ" నందగోపుడి "కోయిల్ కాప్పానే!" భవనాన్ని కాపాడేవాడా! నందగోపుడెందుకు మాకు,  అసలు నీవే మానాయకుడివి. చిన్న పిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు, లోనికి పంపాడు. అక్కడ ఇంకో  ద్వార పాలకుడు ఉన్నాడు, అక్కడ "కొడిత్తోన్ఱుమ్" ఒక గరుడ ద్వజం ఉంది, దాన్ని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉందేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి అందరూ రాత్రుల్లే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో, తనను చేరల్సినవారు పొరపాటుతో వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు - ఆ గరుడ ద్వజం. ఇదీ భగవంతుని చేష్ట. "తోరణ వాశల్ " మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేసాడు నందగోపుడు. ఎందుకంటే  శ్రీకృష్ణుణ్ణి చూద్దామని వచ్చిన వాళ్ళు.  అధ్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుణ్ణే మరచిపోయేట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడియందు మాత్రమే దృష్టి కల్గినవారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే, ఒక వేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతావు, అది దాటితే లోపలున్న పరమాత్మను దర్శనం చేసుకుంటావు. అలాగే శ్రీకృష్ణుడి భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని "కాప్పానే" కాపాడేవాడా  అని నమస్కరించారు. "మణిక్కదవం " మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం "తాళ్ తిఱవా" తాళ్ళం తీయవయ్యా. 


ఎందుకొచ్చారు మీరింత రాత్రి అడిగాడు ఆయన. శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వీళ్ళేదు  అన్నాడేమో "ఆయర్ శిఱుమియరోముక్కు" చిన్న గొల్ల పిల్లలం మేమంతా. మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. "అఱై పఱై" వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాం అన్నారు. ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది కాని, " నెన్నలే  వాయ్-నేరుందాన్" నిన్న మమ్మల్ని కల్సి ఇంటికి రమ్మన్ని మాచుట్టూ తిరిగాడు, ఇప్పుడు మేం అయనచుట్టు తిరగాల్సొస్తుంది, "మాయన్" ఉత్త మాయావి,  మరి వదిలేద్దామా అయనని అంటె "మణివణ్ణన్" ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వటమం లేదయా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయా మేం. "తూయోమాయ్ వందోమ్"  చాలా పవిత్రులమై వచ్చాం, ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు, ఆయనేదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కాని మేం వచ్చింది "తుయిలెర ప్పాడువాన్" ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని.
"వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా" అమ్మా స్వామీ ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా, "నీ నేశనిలైక్కదవం" శ్రీకృష్ణ ప్రేమచే సుదృడంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు,  ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు, వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ, ఎవ్వరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు, "నీక్కు" నీవే తీయవయ్యా అని అయనను ప్రార్థించి లోపలికి వెళ్ళారు.


Monday, December 30, 2013

తిరుప్పావై పాశురము 15 - ఆచార్య సన్నిదానానికి చేరే ముందర స్థితి


మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవసహజం, కాని దాన్ని ఓరిమితో సహించడం మానవప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాం. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే, అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిదానానికి చేరే ముందర కల్గాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి . ఈ రోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది.

ఈరోజు పాశురం బయటగోపబాలికలకు లోపలగోపబాలిక మద్య సంభాషనలా సాగుతుంది.
నిన్నటి గోపబాలికతో కల్సి వీరంతా స్వామిని పంఖజ నేత్రా, పుండరీకాక్షా అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమో నని అనుకోని తాను లోపలనుండే గొంతు కలిపి ఆనందిస్తుంది.
అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోప బాలిక మెలుకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో,  "ఎల్లే!" ఏమే  "ఇళంకిళియే!" లేత చిలకా!  "ఇన్నం ఉఱంగుదియో" ఇంకా నిద్ర పోతూనే ఉన్నావా. వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోప బాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడు అని భావిస్తున్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు.

కాని లోపల గోప బాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని,  శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి "శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్" ఏమిటా గోల మీరంతా, శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమి లేడు "నంగైమీర్!" పరిపూర్ణులు మీరే.  "పోదరుగిన్ఱేన్" వస్తున్నాను అని అంది.

 బయట నుండి వాళ్ళు " వల్లై" మహా సమర్దురాలివే "ఉన్ కట్టురైగళ్" నీనోటి దురుసుతనం మాకు తెలుసులే, "పండేయున్ వాయఱిదుమ్"  ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు.  అంతలో లోపల గోప బాలిక "వల్లీర్గళ్ నీంగళే" మీరే సమర్థులు,  నన్నా సమర్థురాలు అని అంటున్నారు, అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే భాదలో ఉన్నాను,  మీరేమో అంతా కల్సి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారు,    "నానే తాన్ ఆయిడుగ" రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది.
కాని బయట నుండి, "ఒల్లై నీ పోదాయ్"  ఏమే రా! మరి ఇంక,  "ఉనక్కెన్న వేఱుడైయై" మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా మరోకసారి ఎత్తిపొడిచారు లోపల గోపబాలికను పరిక్షించటానికి. ఆమె లోపలనుండి "ఎల్లారుం పోందారో" అంతా వచ్చారా అంది, బయటనుండి వీల్లు "పోందార్" అందరూ వచ్చారు, నీవు బయటికి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు.

 "పోంద్-ఎణ్ణిక్కోళ్" ఏం చేద్దాం అందరం అని ఆడిగింది లోపల గోప బాలిక. "వల్లానై కొన్ఱానై " బలం కల్గిన ఏనుగు -కువలయాపీడం "మాత్తారై మాత్తరిక్కవల్లానై" దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి, శత్రువులలోని శత్రుత్వాన్ని తోలగించగల్గినవాడు "మాయనై" చిత్ర విచిత్ర మైన మాయలు చేసే మాయావిని "ప్పాడ" పాడుదాం.


ఆండాళ్ తల్లి అయిదోపాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మథురలో, పెరిగింది గోకులంలో అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మల్లీ మథురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేసాడు. మథురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చేవరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి రాత్రికే యమునానది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు, అక్కడికి పంపిన పూతన,  శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడివారిని పిచ్చెక్కించి, అక్కడినుండి తిరిగి మథురకు వచ్చి కువలయాపీడాన్ని, చారూణముశ్టికులను చంపి, కంసున్ని చంపి, బందీగా ఉన్న ఉగ్రసేనున్ని రాజుగా చేసి మథురానగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు.  ఇది భగవంతుడు చేసే చేష్ట. 

ఈరోజుతో పదో గోపబాలికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కల్గిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగ గలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి  ప్రార్థించాలి తప్ప, లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు.  తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. పదిమంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావై అంటారు, ఇక ఈ నమ్మకం గట్టి పడటానికి మిగతా పాటలు.

Sunday, December 29, 2013

తిరుప్పావై పాశురము 14 - వేదమే ప్రమాణం

మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.  ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.


"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్"
ఎర్ర కలవలు వికసిస్తున్నాయి "ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్" నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు.  లేదమ్మా అయితే, "ఉంగళ్ పురైక్కడై" నీ ఇంటి పెరటి "త్తోట్టత్తు వావియుళ్" తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ "నీ" అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది, నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి, పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు, ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని, శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు. 
పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక.
"శెంగల్పొడి క్కూరై" కాషాయాంభరధారులు "వెణ్బల్ తవత్తవర్" తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు "తంగళ్ తిరుక్కోయిల్ " ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి "శంగిడువాన్" తాళాలు తెరువడానికి "పోగిన్ఱార్" వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.  తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది, అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి, లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి, తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది.

అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం, అంటూ  "ఎంగళై" మమ్మల్నందరిని "మున్నం ఎరుప్పువాన్"  ముందే లేపుతాను అని "వాయ్ పేశుమ్" వాగ్దానం చేసావు. "నంగాయ్!" పెద్ద పరిపూర్ణురాలివే!  "ఎరుందిరాయ్" లేవమ్మా "నాణాదాయ్!" నీకు సిగ్గు అనిపించటంలేదా "నావుడైయాయ్" పెద్ద మాటకారిదానివి. జ్ఞానులు తమ హృదయంలో  భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో.  లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో " శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ" ఆమె హృదయం, దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం, నీవు ఆ యోగ్యత కల్గిన దానివి, నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు. 

Saturday, December 28, 2013

తిరుప్పావై పాశురము 13 - తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు



ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన  జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో  ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అనిరెండు జట్టులుగా విడిపోయారు.
వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మద్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె  శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత  వాల్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి " సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.


కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై"  ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై"  రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు.   "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.

"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ  "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే  గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది,  "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు"  అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోదంగా ఉన్నాయి,  ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి  చేరటానికి ఇది సరియైన సమయం.

"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా.  తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టిచ్చుకోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో  "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా   "పావాయ్!" ముగ్దత కల్గిన దానా,  " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.

Friday, December 27, 2013

తిరుప్పావై పాశురము 12 - లక్ష్మణుడి కర్మ విదానం



భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు  అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశ ను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్శణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు."ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే  |
  ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్  ||
"


వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు.  మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు. "దుఖెఃషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే 
"


ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు.  ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.


"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది, ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమజ్ఞమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి ,  "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి  కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం  చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే.  నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం  కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది.  "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం,  ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం క్కొట్టుకు పోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పై కప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .
అయితే లోపలున్న గోప బాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో  "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా  "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా!  "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇక నైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి.